Friday 23 December 2011

కవిత - 17

స్నేహం


కాలం నీకోసం ఆగదు
ఘనపదార్థం గుంజితే సాగదు
వింతలేనిదే గుంపు మూగదు
అట్లే .. స్నేహంతో సరి ఏదీ తూగదు.

మొక్క పెరిగాక వంగదు
పిల్లలకు గట్టి పదార్థం దంగదు
చిన్నచేప పెద్దచేపను మింగదు
అట్లే ... స్నేహం పొగడ్తలకు పొంగదు.

మకరందానికి మారుగా
మాతృప్రేమ తరువాయిగా
మహిలో ఆలంబనగా నిలిచి
ఆత్మీయంగా ఆదరించేదే స్నేహం.

అరుపులు, మూతి విరుపులు, వెరపులు
పగలు, ప్రతీకారాలు, కఠిన్యాలు,
సాధింపులు, విభేదాలు, వేదింపులు
ఇవేవీ కానరాని
రెండు మనస్సుల కలయికే ... స్నేహం!

Tuesday 20 December 2011

కవిత - 16

ప్రియసఖి

నీరు నిండిన నా కళ్లకు నీ రూపం
సరిగ్గా ఆనదని తలచి కళ్ళుమూసానే కాని
నిన్ను చూడవద్దని కాదు, అయినా ...
నీవు వెళ్ళిపోయావు నే కళ్ళు తెరవకముందే!

నీవు నాకై వస్తానని అన్నావనే సంతోషంతో తాగితే
నీవు వచ్చి వెళ్ళేవరకు మెలకువ లేదు నాకు,
నీవు వచ్చి వెళ్ళావనే వేదన నాచేత మళ్ళీ తాగిస్తే
నీవు రేపు వస్తానన్నాననే మాట మరిచి నిద్రపోయాను.

నేను నీకోసం ఎదురుచూసిన దినాలలో
నీవు నాకు ఎదురుకాలేదన్న వేదన కన్న
ఎదురుతిరుగలేదనే స్వాంతన ఆనందాన్నిచ్చింది.
అందుకే ఇన్నాళ్ళయినా ఎదురుచూస్తూనే ఉన్నాను.


ఆమె సమాధిపై నేను నాటిన
గులాబీ పూసిందని ఎవరో అన్నారు, 
వాళ్ళకేం తెలుసు ఇన్నాళ్ళకు
గులాబివేర్లు ఆమె వేళ్ళను తాకాయని!

Thursday 1 December 2011

కవిత - 15

భయం - భయం

వానచుక్కనై నేలమొక్కను చేరి
మొక్కలు చచ్చిపోకుండా కాపాడాలని,
ఉక్కకు చస్తూ, నీడకై దిక్కులు చూసేవాళ్ళకై
నిప్పుగా ఉన్న నేలను చల్లార్చాలని నాకున్నా
సంద్రాన పడి నిరుపయోగి నౌతానని భయం!


పద్ద చెట్టునై రెక్కల కొమ్మ లల్లార్చి,
మండించే ఎండను కొంతైనా చల్లార్చాలని,
అపరిమితంగా కాసి, కొందరి ఆకలినైనా తీర్చాలని
ఆశగా కొద్ది కొద్దిగా నేను ఎదగగానే
నీ గూటికోసం, నాగటికోసం నన్ను నరుకుతావనే భయం!


అమ్మనై చేతుల పొత్తిళ్ళలోని నిను చూస్తూ,
పలురకాలుగా కాపాడుతూ పెంచాను ప్రేమతో
నీ నిద్రకోసం నా నిద్రకాచి, ఎన్నో ఓర్చి పెంచితే
సతి మాటలనే వినే పతివై, మతిహీనుడవై
పనికిరాని పాతవస్తువల గదికి పంపుతావనే భయం!

Sunday 27 November 2011

కవిత - 14

                           రేపటి సూర్యులు

వీళ్లు ....
రేపటి ప్రచండభాస్కరుని ప్రతిరూపాలేనా?
అయితే వీళ్ళ ముఖాలపై
మాయని చీకటి పుట్టుమచ్చ లెక్కడివి?
జనం లేని వనంలో
ఎవరిని శిక్షిద్దామని వెళ్తున్నారు?
చిరునవ్వుల్ని చిరుతపులి కోరల్లో కుదువబెట్టి
గుండెల్లో విచ్చుకున్న పువ్వుల్ని
గూడాల చేతుల్లో లంచంపెట్టి
పిరికిపందల్లా పారిపోతున్నారు.
రేపు ఉదయించే సూర్యున్ని
ఎవరికి తిలకంగా దిద్దమంటారు?
తమ్ముళ్ళూ ...!
ఇలా రండి ఒక్కసారి ...
బొగ్గుగనుల్లో నా కిక్కడ
బోలెడన్ని వజ్రాలు దొరుకుతున్నాయి.
వీటికి విలువగట్టి
వినియోగించుకోవలసించి మీరే! 


రచన - శంకర్
(స్రవంతి - ఏప్రిల్ 1985)

Saturday 26 November 2011

కవిత - 13

                             అసామాన్యుడు

నువ్వు .....
మామూలు మానవుడివి కానేకావు.
గుండెల్లో గుడిగంటల కోలాహలాన్నీ
అడుగుల్లో ఐరావతాల పురోగమనాన్నీ
చేతుల్లో చేతస్సుధాకలశాన్నీ
మాటల్లో బీజాక్షరాల విన్యాసాలనూ
చూపుల్లో దివ్యాస్త్రాల వాడినీ
రూపంలో దాపరికంలేని దైవత్వాన్నీ
రంగరించుకున్నవాడివి!
నువ్వు తలచుకుంటే
అక్షాంశాలూ రేఖాంశాలూ
నీ యింటి ముంగిట
సంక్రాంతి ముగ్గులౌతాయి.
చందమామ గిన్నెలోని వెన్నెల వెన్నముద్దలు
నేల పాలౌతున్నందుకు నిట్టూర్చకు ....
స్తబ్ధుడవై కూర్చోకు ...
నీకోసం ముంచుకొస్తున్న వెలుగు వెల్లువలో
కాసేపు కరిగిపోతే చాలు ....
..... నువ్వు అసామాన్యుడవే!

రచన - శంకర్ (28-2-1985)

Friday 25 November 2011

కవిత - 12

పరిత్యక్త

నన్నెవ్వరూ పట్టించుకోవడం లేదు!
          ఈ చిన్న గదిలో
          నన్ను నేను బంధించుకొని
          ఒంటరిగా ... ఓపికగా
          నిరీక్షిస్తున్నాను.

నన్నెవ్వరూ వినిపించుకోవడం లేదు!
          ప్రశాంత నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ
          పిలుపును పాటగా కూర్చి
          వివిధ రాగాల్లో వింత శబ్దాలతో 
          ఆలపిస్తున్నాను.

నన్నెవ్వరూ  ఇష్టపడడం లేదు!
          తలుపులు మూసి
          కిటికీలు తెరిచి 
          నా గది జైలులో 
          సహజీవనం చేయడానికి 
          మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.

రచన - శంకర్ 

Wednesday 23 November 2011

కవిత - 11

ఆత్మాపహారం

ఖాళీ చేసిన విస్కీబాటిల్ తో
పారేసిన సిగరెట్ పీకలు
బాతాఖానీ చేస్తున్నప్పుడు
నా కళ్ళ ముందున్న ప్రపంచం
నన్ను బొంగరంలా తిప్పుతున్నప్పుడు
కలం కాగితంపై ప్రసవించే అక్షరాలు
క్రమశిక్షణ లేని సైనికుల్లా
నా మీదనే 
ఆత్మపరిశీలన ఆయుధాలను
గురిచూసినప్పుడైనా
తెరచుకోని నా కళ్ళు
ఇంకా మూసుకుపోతుంటే
గొంతు మాత్రం
అరువు తెచ్చుకున్న అందమైన అబద్ధాలను
క్రమబద్ధం కాని లయతో
పాడుతూనే ఉంది. 

రచన - శంకర్ (27/2/1985)

Tuesday 22 November 2011

కవిత - 10

వెలుగే గమ్యం

నిన్న నవ్విన పువ్వుల్ని జోకొట్టిన బాటలో
ఈరోజు చూస్తే ఇనుపపాదాల గుర్తులు ...
వాటి రేకుల బట్టల నిండా
కాలం పులిమిన రక్తపు మరకలు ...
వెలుగు దిశగా పోతున్న ఈ మార్గంలో
ఎన్నో చీకటి మజిలీల నిజాలు ...
అగుపించని అభ్యంతరాల ముళ్ళ కౌగిలింతలు!
ఆశలు నిండిన చూపుల బాణాల్ని సంధించి
ఉదయ హరిణాన్ని వేటాడబోయిన మిత్రులు
కొండను తాకి సుళ్ళు తిరిగిన ప్రవాహంలా
నా కెదురవుతున్నారు.
వాళ్ళ ముఖాల్లో
      తృప్తి లేదు ... అలసట తప్ప!
      ఆనందం లేదు ... అసహనం తప్ప!
అయినా నా యీ నిరంతర యాత్ర
సాగిస్తూనే ఉన్నాను ... గమ్యం చేరాలని!
అక్కడ
కాంతిధారలో అభిషిక్తుడనై
నన్ను నేను 
వెలుగుముద్దగా మార్చుకుందామని!

రచన - శంకర్
(జనధర్మ - 3/3/1985)

Monday 21 November 2011

కవిత - 9

                           ఆశావలయం

నిన్ననే రెక్కలు మొలిచిన ఆశల పక్షులు
ఆహ్వానాల దిక్సూచిని పట్టుకొని
ఈరోజు దిగంతాల వైపు
చీకటి గీతల్ని గీస్తూ దూసుకుపోతున్నాయి.
తరాలుగా తగులబడుతున్న
సంప్రదాయాల అడవుల్ని ఆర్పడానికి
గంగాజలాల్ని మళ్ళించాలని
జనారణ్యంలోని కొంపలార్పేవాళ్ళు
అపర భగీరథులై అహర్నిశలూ
పథకాల పరేడ్ చేయిస్తున్నారు.
ఢిల్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ లో
తన నియోజకవర్గం ప్రజల్ని తల్చుకుని
నాయకుడు విడిచిన కన్నీటి బొట్టును
టెస్ట్ ట్యూబ్‍లో భద్రం చేసి
ఊరూరా తిప్పడానికి
విమానం ఎక్కిస్తున్నారట!
నేను మాత్రం
వానకు తడిసి, ఎండకు ఎండి
అలుక్కుపోయిన అక్షరాలతో
ఏడుస్తున్న నా పాత డైరీలను
కొత్తపుస్తకాల్లా చదువుకొంటున్నాను. 


రచన - శంకర్.
(19-2-1985)

కవిత - 8

                              ప్రతిబింబం

గాజుకళ్ళ వినీలచ్ఛాయావరణంలో
అనుభవాల తాలూకు పగుళ్ళ నెగళ్ళు,
అమృతాభిషేకాన్ని కాంక్షిస్తూ
ప్రపంచకూపం నుండి చేదుకుంటున్న
చూపుల బొక్కెన నిండా
హృచ్ఛకలాలు తేలే రక్తాశ్రుపూరం,
కదిలే పెదాల గుహాముఖాల చీకట్లో
నిబద్ధ వర్ణచిత్రాల గుసగుసలు,
ఆత్మన్యూనతా పరిధిలో లయలేని
విలయోన్ముఖ పదఘట్టనల ఫిరంగుల మోతలు,
గుండె గూడులో కునుకు తీస్తున్న
ఆశాబుద్బుదాల విస్ఫోటనా వికటధ్వనులు.
ముళ్ళచేతులు రువ్వే నవ్వుల పువ్వుల్ని అందుకోలేక
లోకం దర్పణంలో
ముక్కలై  ఏడుస్తున్న ప్రతిబింబాన్ని చూసి

భయపడితే ఎలా? .... అది నీదే!
  
రచన - శంకర్
(భారతి - జులై 1986) 

Wednesday 16 November 2011

కవిత - 7

అమ్మ

మాధుర్యాన్ని, మమతను కలగలిపితే
ఓ కమ్మని బొమ్మ - ఆ బొమ్మ పేరే అమ్మ.

ఓర్పును, ఓదార్పును కలగలిపితే
ఓ మధురమైన చిత్తురువు - ఆ చిత్తరువే అమ్మ.

కారుణ్యాన్ని, కమనీయతను కలగలిపితే
ఓ కమ్మని ఆకృతి - ఆ ఆకృతే అమ్మ.

ఒక రాగాన్ని, త్యాగాన్ని కలగలిపితే
ఒక మధురస్మృతి - ఆ మధురస్మృతే అమ్మ.
     
ఓ లాలనను, ఓ తేనియను కలగలిపితే
ఓ కమ్మని రుచి - ఆ రుచి పేరే అమ్మ.

జాబిలిని, జాలిని కలగలిపితే
ఒక మధుర కృతి - ఆ కృతి పేరే అమ్మ.

తొలకరిని, కమ్మని కలని కలగలిపితే
ఓ అద్భుతరూపం - ఆ రూపమే అమ్మ.

ప్రాణాన్ని, ప్రాణవాయువును కలగలిపితే
ఓ మాధుర్య సజీవశిల్పం - ఆ శిల్పమే అమ్మ.






Friday 28 October 2011

కవిత - 6

నా తప్పు కాదు ప్రభూ!

ఓపలేని ఒంటరితనం - సైపరాని అస్వస్థత
నన్ను చుట్టి, కదలనీక కట్టి, మట్టుపెట్ట నెంచగా
ఏ పనీ చేయలేని నాకు
గుర్తుకొచ్చాయి ... నీ దయావాత్సల్యాలు.
మూర్తీభవించిన దైన్యంతో - ఆర్తిగా నీదెస చూడగా
నన్ను ఏమార్చి నా కంట జారిన కన్నీరు
నా తప్పు కాదు ప్రభూ!


ఆదాయం ఐదు కాగా - అవసరాలు పదిహేనై
పెరిగిన ఇక్కట్లు నన్ను - చీకట్ల ఊబిలోకి దించగా
దిక్కేది లేక .. ఇక దక్కను అనుకున్నవేళ
నిన్ను పిలవాలనే ఆశ - నాలో సర్వత్రా నిండి

"ప్రభూ!" అని నిన్ను పిలవడం
నా తప్పు కాదు ప్రభూ!

అయినవాళ్ళే కాని - అవసరాలకు ఆదుకోరు
నమ్మిన పాపానికి - నిట్టనిలువునా ముంచేవాళ్ళు
కోకొల్లలై దిశలను, దీనులను ముంచుతున్నవేళ
ఎన్నో సునామీలు, ఎన్నెన్నో భూకంపాలు, మరెన్నో రోగాలు
వాళ్ళందరినీ రూపరచాలని కోరడం
నా తప్పు కాదు ప్రభూ!

Tuesday 25 October 2011

కవిత - 5

అమ్మ

గాలిగాడు గోలగా ఆడుతూ "అమ్మా!" అన్నాడు దైన్యంగా
తన పిచ్చిగంతుల్లో మూతి రాయికి కొట్టుకోగా ...
ఈకల స్వెట్టర్ రానందువల్ల చలికి వణుకుతూ
"అమ్మా!" అన్నది ఒక పిట్టపిల్ల దీనంగా ...
పైనుండి పల్లానికి జారుతున్న బండను చూసి
"అమ్మా!" అన్నదో ఇసుకపిల్ల గుండె పగిలేలా ...
తల్లి పొదుగునుండి తనను లాగి పాలుపిండే
రైతువంక వేదనతో చూస్తూ "అమ్మా!" అందో దూడ ....
నల్లని పెద్దమబ్బు తనను గట్టిగా కొట్టగా
"అమ్మా!" అందో పిల్లమబ్బు వానగా కన్నీళ్ళు రాలుస్తూ ....
కాలుకు ముల్లంటిననాడు - నిప్పుకు కాలంటిననాడు
గొల్లుగా, గోలగా ఏడుస్తూ "అమ్మా!" అందో చిన్నపాప ....
పీచు జుట్టున్న తాటిచెట్టన్న ఎప్పుడు పడతాడో అనే భయంతో
అటూ ఇటూ ఒరుగుతుంది చేను "అమ్మా!" అంటూ ...
ఇన్నిచోట్ల అన్నీ కలిసి "అమ్మా!" అని అంటుంటే
"అమ్మ అంటే?" అనే నా ప్రశ్నను గట్టిగా అంటే ...
"ఎవరా ప్రశ్న వేసింది?" అంటూ మేఘం
మెరుపుకళ్లతో కోపంగా చూస్తూ
ఉరుముల కంఠంతో గర్జిస్తూ
పిడుగుపాటులా ప్రశ్నిస్తే ...
అప్రయత్నంగా "అమ్మా!" అంటూ
బెదిరిపోయి ఇంట్లోకి ఉరికాను!

Thursday 13 October 2011

కవిత - 4

పాపం - పుణ్యం

నేల తల్లికి, ముండ్ల తండ్రికి
పుట్టిందో గులాబిచెట్టు.
పెరిగిన అది అందంగా నవ్విందట
ఆ నవ్వు పేరు పువ్వట!
తల్లి మురికిని కానీ, తండ్రి కరకుదనాన్ని కానీ
తనలో ఉంచుకోలేదు ఆ పువ్వు.

సంపాదించే తల్లికి, ఎలాగైనా సాధించే తండ్రికి
పుట్టాడో తనూజుడు.
తల్లి దస్కాన్ని మింగుతూ, తండ్రికి సరిసమానంగా
పెరిగాడు అన్ని అవగుణాలతో ..

పువ్వు చేసిన పుణ్యం - నరులు చేసిన పాపం
తరు లెరుగవు - నరు లెరుగరు.

తనను తాను ఇతరులకై ఇచ్చుకోవడం
తరువు చేసుకున్న ‘పుణ్యం’
తనకోసమే ఇతరులను కాలరాయడం
నరులు చేసుకొనే ‘పాపం’

Monday 10 October 2011

కవిత - 3

ఎప్పుడో? - ఏనాడో?

మధురోక్తులను వింటి - మధుర ఫలముల తింటి
పెంటదిబ్బల మీద - మింటి అందము నంటు
మట్టిపువ్వుల కంటి - మంచినవ్వుల కంటి
పూల వెంటనె ఉంటు - పూతేనియల తింటు
ఝుమ్మంటు తిరుగాడు - ఎలతేటులను కంటి

అసురసంధ్యావేళ - అరవిచ్చు కలువల్ని
అగుపడని చెలునికై - అలిగిన కమలాల్ని
చల్లనౌ ఉదయాన - పిల్లమొక్కల పైన
అల్లనల్లన పడిన - మంచుజల్లుల కంటి
చిరుగాలి తాకిడికి - చిరునవ్వులను చిందు
చిన్నారి పూబాల - చిత్రమ్మునే కంటి

చిరుచీకటులు నిండ - బెదురుతున్న వెలుగుల్ని
చిరువెలుగు రేఖలకె - అదురుతున్న నలుపుల్ని
మేఘాల మెరుపుల్ని - లేదూడ అరుపుల్ని
చిరుమువ్వ పలుకుల్ని - అల పాప నవ్వుల్ని
ఎన్నెన్నొ కన్నాను - మరి ఎన్నొ విన్నాను
శాంతి దక్కలేదు - భ్రాంతి మొక్కవోదు.

తలపులందున ఉన్న - తపనయే కడుమిన్న
ఉన్న చోటున నన్ను - ఉండనీ దన్నా!
నయనాల తమిదీర - ఆనంద మెద మీర
కనులార నా ప్రభుని - కనుగొనుట ఎప్పుడో?
ఆ ప్రభుని చరణాల - పై వ్రాలు టేనాడొ?

Sunday 9 October 2011

కవిత - 2

చిన్న ఆశ
నిలువుకొండల్ని సులువుగా
ఎక్కగల్గిన నా పాదాలు
పట్టుతప్పుతున్న ఈ రోజుల్లో ...


గమకాల ఝరియైన నా గాత్రం
సూత్రప్రాయంగా పసలేనిదై
రసాభాసం అవుతున్న ఈ రోజుల్లో ...


నాటివి, పైనాటివి, ఏనాటివో
గుర్తుంచుకొనే నా జ్ఞాపకశక్తి
నిన్నటివి, నేటివి, ఇప్పటివే
మరుస్తున్న ఈ రోజుల్లో ...


మెత్తని సవ్వడుల్ని, అతిమెత్తని గుసగుసల్ని
వినే నా వినికిడి అరుపుల్ని, కేకల్ని
వినలేకపోతున్న ఈ రోజుల్లో ...


కారుచీకట్లలో నల్లపూసల్ని
ఏరగల నా కళ్ళు నిండువెలుగుల్లో
రంగుల్ని గుర్తించలేని ఈ రోజుల్లో ....

ఆరోగ్యమే తానైన నా ఆరోగ్యం
మెల్లమెల్లగా అనారోగ్యపు హద్దుల్ని చేరి
దాన్ని అధిగమిస్తున్న ఈ రోజుల్లో ...


నాలోని లోన తలెత్తి నిఠారయింది ..
ఓ చిన్న తలపు ... నిన్ను చేరేందుకు
నా తనువు తయారౌతుందన్న
చిన్న ఆశ!

Saturday 8 October 2011

కవిత -1

పరిహారం కాలేదా ప్రభూ?
నీఇంట, నీవెంట, నీసందిట
నేనున్నప్పుడు,
అసంకిల్పితంగా ఎప్పుడైనా
ఎదురాడినానా ప్రభూ?

నీచెంత ఏచింత లేకుండా ఉంటూ
అనాలోచితంగా నోరుజారి
కానిమాట ఏదైనా  అన్నానా ప్రభూ?

నీలాలనలో మేను మరచి నిద్రించిన నేను
నా కలవరింతలలో నిన్ను కలతపరచే
కఠినమైన మాట ఏదైనా అన్నానా ప్రభూ?

నీకోసం సాగిన నా వెతుకులాటలో
నా సరసన నిన్ను గానక నిరసనతో
ఏదైనా కరకుమాట నేనన్నానా ప్రభూ?

నా ఆలోచనలు నాలోని నిన్ను ఏమార్చ
నన్ను నేనుగా పైకెత్తుకోని - నిన్ను
కించపరచే మాట నోట జార్చానా ప్రభూ?

తెలియక, తెలివిలేక, తొందరతనంతో
నోరుజారిన నా నేరాన్ని క్షమించలేవా ప్రభూ?
మందమతినై నేనన్న మాటను మన్నించలేవా ప్రభూ?
నీకు దూరంగా అరవై వత్సరాల శిక్ష భరించాను
కాని మాటకు పరిహారం కాలేదా ప్రభూ?
అయిందా? నన్ను చేర్చుకో ..
లేదా ... నాతో ఉండు!