Sunday 9 October 2011

కవిత - 2

చిన్న ఆశ
నిలువుకొండల్ని సులువుగా
ఎక్కగల్గిన నా పాదాలు
పట్టుతప్పుతున్న ఈ రోజుల్లో ...


గమకాల ఝరియైన నా గాత్రం
సూత్రప్రాయంగా పసలేనిదై
రసాభాసం అవుతున్న ఈ రోజుల్లో ...


నాటివి, పైనాటివి, ఏనాటివో
గుర్తుంచుకొనే నా జ్ఞాపకశక్తి
నిన్నటివి, నేటివి, ఇప్పటివే
మరుస్తున్న ఈ రోజుల్లో ...


మెత్తని సవ్వడుల్ని, అతిమెత్తని గుసగుసల్ని
వినే నా వినికిడి అరుపుల్ని, కేకల్ని
వినలేకపోతున్న ఈ రోజుల్లో ...


కారుచీకట్లలో నల్లపూసల్ని
ఏరగల నా కళ్ళు నిండువెలుగుల్లో
రంగుల్ని గుర్తించలేని ఈ రోజుల్లో ....

ఆరోగ్యమే తానైన నా ఆరోగ్యం
మెల్లమెల్లగా అనారోగ్యపు హద్దుల్ని చేరి
దాన్ని అధిగమిస్తున్న ఈ రోజుల్లో ...


నాలోని లోన తలెత్తి నిఠారయింది ..
ఓ చిన్న తలపు ... నిన్ను చేరేందుకు
నా తనువు తయారౌతుందన్న
చిన్న ఆశ!

4 comments:

  1. భాస్కర రామిరెడ్డి గారూ,
    ధన్యవాదాలు.

    ReplyDelete
  2. కవిత చాలా బావుంది. పయనం ఎక్కడికో తెలిసాక విషాదంగా అనిపించింది.

    ReplyDelete
  3. జ్యోతిర్మయి గారూ,
    కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete