Sunday 27 November 2011

కవిత - 14

                           రేపటి సూర్యులు

వీళ్లు ....
రేపటి ప్రచండభాస్కరుని ప్రతిరూపాలేనా?
అయితే వీళ్ళ ముఖాలపై
మాయని చీకటి పుట్టుమచ్చ లెక్కడివి?
జనం లేని వనంలో
ఎవరిని శిక్షిద్దామని వెళ్తున్నారు?
చిరునవ్వుల్ని చిరుతపులి కోరల్లో కుదువబెట్టి
గుండెల్లో విచ్చుకున్న పువ్వుల్ని
గూడాల చేతుల్లో లంచంపెట్టి
పిరికిపందల్లా పారిపోతున్నారు.
రేపు ఉదయించే సూర్యున్ని
ఎవరికి తిలకంగా దిద్దమంటారు?
తమ్ముళ్ళూ ...!
ఇలా రండి ఒక్కసారి ...
బొగ్గుగనుల్లో నా కిక్కడ
బోలెడన్ని వజ్రాలు దొరుకుతున్నాయి.
వీటికి విలువగట్టి
వినియోగించుకోవలసించి మీరే! 


రచన - శంకర్
(స్రవంతి - ఏప్రిల్ 1985)

Saturday 26 November 2011

కవిత - 13

                             అసామాన్యుడు

నువ్వు .....
మామూలు మానవుడివి కానేకావు.
గుండెల్లో గుడిగంటల కోలాహలాన్నీ
అడుగుల్లో ఐరావతాల పురోగమనాన్నీ
చేతుల్లో చేతస్సుధాకలశాన్నీ
మాటల్లో బీజాక్షరాల విన్యాసాలనూ
చూపుల్లో దివ్యాస్త్రాల వాడినీ
రూపంలో దాపరికంలేని దైవత్వాన్నీ
రంగరించుకున్నవాడివి!
నువ్వు తలచుకుంటే
అక్షాంశాలూ రేఖాంశాలూ
నీ యింటి ముంగిట
సంక్రాంతి ముగ్గులౌతాయి.
చందమామ గిన్నెలోని వెన్నెల వెన్నముద్దలు
నేల పాలౌతున్నందుకు నిట్టూర్చకు ....
స్తబ్ధుడవై కూర్చోకు ...
నీకోసం ముంచుకొస్తున్న వెలుగు వెల్లువలో
కాసేపు కరిగిపోతే చాలు ....
..... నువ్వు అసామాన్యుడవే!

రచన - శంకర్ (28-2-1985)

Friday 25 November 2011

కవిత - 12

పరిత్యక్త

నన్నెవ్వరూ పట్టించుకోవడం లేదు!
          ఈ చిన్న గదిలో
          నన్ను నేను బంధించుకొని
          ఒంటరిగా ... ఓపికగా
          నిరీక్షిస్తున్నాను.

నన్నెవ్వరూ వినిపించుకోవడం లేదు!
          ప్రశాంత నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ
          పిలుపును పాటగా కూర్చి
          వివిధ రాగాల్లో వింత శబ్దాలతో 
          ఆలపిస్తున్నాను.

నన్నెవ్వరూ  ఇష్టపడడం లేదు!
          తలుపులు మూసి
          కిటికీలు తెరిచి 
          నా గది జైలులో 
          సహజీవనం చేయడానికి 
          మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.

రచన - శంకర్ 

Wednesday 23 November 2011

కవిత - 11

ఆత్మాపహారం

ఖాళీ చేసిన విస్కీబాటిల్ తో
పారేసిన సిగరెట్ పీకలు
బాతాఖానీ చేస్తున్నప్పుడు
నా కళ్ళ ముందున్న ప్రపంచం
నన్ను బొంగరంలా తిప్పుతున్నప్పుడు
కలం కాగితంపై ప్రసవించే అక్షరాలు
క్రమశిక్షణ లేని సైనికుల్లా
నా మీదనే 
ఆత్మపరిశీలన ఆయుధాలను
గురిచూసినప్పుడైనా
తెరచుకోని నా కళ్ళు
ఇంకా మూసుకుపోతుంటే
గొంతు మాత్రం
అరువు తెచ్చుకున్న అందమైన అబద్ధాలను
క్రమబద్ధం కాని లయతో
పాడుతూనే ఉంది. 

రచన - శంకర్ (27/2/1985)

Tuesday 22 November 2011

కవిత - 10

వెలుగే గమ్యం

నిన్న నవ్విన పువ్వుల్ని జోకొట్టిన బాటలో
ఈరోజు చూస్తే ఇనుపపాదాల గుర్తులు ...
వాటి రేకుల బట్టల నిండా
కాలం పులిమిన రక్తపు మరకలు ...
వెలుగు దిశగా పోతున్న ఈ మార్గంలో
ఎన్నో చీకటి మజిలీల నిజాలు ...
అగుపించని అభ్యంతరాల ముళ్ళ కౌగిలింతలు!
ఆశలు నిండిన చూపుల బాణాల్ని సంధించి
ఉదయ హరిణాన్ని వేటాడబోయిన మిత్రులు
కొండను తాకి సుళ్ళు తిరిగిన ప్రవాహంలా
నా కెదురవుతున్నారు.
వాళ్ళ ముఖాల్లో
      తృప్తి లేదు ... అలసట తప్ప!
      ఆనందం లేదు ... అసహనం తప్ప!
అయినా నా యీ నిరంతర యాత్ర
సాగిస్తూనే ఉన్నాను ... గమ్యం చేరాలని!
అక్కడ
కాంతిధారలో అభిషిక్తుడనై
నన్ను నేను 
వెలుగుముద్దగా మార్చుకుందామని!

రచన - శంకర్
(జనధర్మ - 3/3/1985)

Monday 21 November 2011

కవిత - 9

                           ఆశావలయం

నిన్ననే రెక్కలు మొలిచిన ఆశల పక్షులు
ఆహ్వానాల దిక్సూచిని పట్టుకొని
ఈరోజు దిగంతాల వైపు
చీకటి గీతల్ని గీస్తూ దూసుకుపోతున్నాయి.
తరాలుగా తగులబడుతున్న
సంప్రదాయాల అడవుల్ని ఆర్పడానికి
గంగాజలాల్ని మళ్ళించాలని
జనారణ్యంలోని కొంపలార్పేవాళ్ళు
అపర భగీరథులై అహర్నిశలూ
పథకాల పరేడ్ చేయిస్తున్నారు.
ఢిల్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ లో
తన నియోజకవర్గం ప్రజల్ని తల్చుకుని
నాయకుడు విడిచిన కన్నీటి బొట్టును
టెస్ట్ ట్యూబ్‍లో భద్రం చేసి
ఊరూరా తిప్పడానికి
విమానం ఎక్కిస్తున్నారట!
నేను మాత్రం
వానకు తడిసి, ఎండకు ఎండి
అలుక్కుపోయిన అక్షరాలతో
ఏడుస్తున్న నా పాత డైరీలను
కొత్తపుస్తకాల్లా చదువుకొంటున్నాను. 


రచన - శంకర్.
(19-2-1985)

కవిత - 8

                              ప్రతిబింబం

గాజుకళ్ళ వినీలచ్ఛాయావరణంలో
అనుభవాల తాలూకు పగుళ్ళ నెగళ్ళు,
అమృతాభిషేకాన్ని కాంక్షిస్తూ
ప్రపంచకూపం నుండి చేదుకుంటున్న
చూపుల బొక్కెన నిండా
హృచ్ఛకలాలు తేలే రక్తాశ్రుపూరం,
కదిలే పెదాల గుహాముఖాల చీకట్లో
నిబద్ధ వర్ణచిత్రాల గుసగుసలు,
ఆత్మన్యూనతా పరిధిలో లయలేని
విలయోన్ముఖ పదఘట్టనల ఫిరంగుల మోతలు,
గుండె గూడులో కునుకు తీస్తున్న
ఆశాబుద్బుదాల విస్ఫోటనా వికటధ్వనులు.
ముళ్ళచేతులు రువ్వే నవ్వుల పువ్వుల్ని అందుకోలేక
లోకం దర్పణంలో
ముక్కలై  ఏడుస్తున్న ప్రతిబింబాన్ని చూసి

భయపడితే ఎలా? .... అది నీదే!
  
రచన - శంకర్
(భారతి - జులై 1986) 

Wednesday 16 November 2011

కవిత - 7

అమ్మ

మాధుర్యాన్ని, మమతను కలగలిపితే
ఓ కమ్మని బొమ్మ - ఆ బొమ్మ పేరే అమ్మ.

ఓర్పును, ఓదార్పును కలగలిపితే
ఓ మధురమైన చిత్తురువు - ఆ చిత్తరువే అమ్మ.

కారుణ్యాన్ని, కమనీయతను కలగలిపితే
ఓ కమ్మని ఆకృతి - ఆ ఆకృతే అమ్మ.

ఒక రాగాన్ని, త్యాగాన్ని కలగలిపితే
ఒక మధురస్మృతి - ఆ మధురస్మృతే అమ్మ.
     
ఓ లాలనను, ఓ తేనియను కలగలిపితే
ఓ కమ్మని రుచి - ఆ రుచి పేరే అమ్మ.

జాబిలిని, జాలిని కలగలిపితే
ఒక మధుర కృతి - ఆ కృతి పేరే అమ్మ.

తొలకరిని, కమ్మని కలని కలగలిపితే
ఓ అద్భుతరూపం - ఆ రూపమే అమ్మ.

ప్రాణాన్ని, ప్రాణవాయువును కలగలిపితే
ఓ మాధుర్య సజీవశిల్పం - ఆ శిల్పమే అమ్మ.