Saturday 8 October 2011

కవిత -1

పరిహారం కాలేదా ప్రభూ?
నీఇంట, నీవెంట, నీసందిట
నేనున్నప్పుడు,
అసంకిల్పితంగా ఎప్పుడైనా
ఎదురాడినానా ప్రభూ?

నీచెంత ఏచింత లేకుండా ఉంటూ
అనాలోచితంగా నోరుజారి
కానిమాట ఏదైనా  అన్నానా ప్రభూ?

నీలాలనలో మేను మరచి నిద్రించిన నేను
నా కలవరింతలలో నిన్ను కలతపరచే
కఠినమైన మాట ఏదైనా అన్నానా ప్రభూ?

నీకోసం సాగిన నా వెతుకులాటలో
నా సరసన నిన్ను గానక నిరసనతో
ఏదైనా కరకుమాట నేనన్నానా ప్రభూ?

నా ఆలోచనలు నాలోని నిన్ను ఏమార్చ
నన్ను నేనుగా పైకెత్తుకోని - నిన్ను
కించపరచే మాట నోట జార్చానా ప్రభూ?

తెలియక, తెలివిలేక, తొందరతనంతో
నోరుజారిన నా నేరాన్ని క్షమించలేవా ప్రభూ?
మందమతినై నేనన్న మాటను మన్నించలేవా ప్రభూ?
నీకు దూరంగా అరవై వత్సరాల శిక్ష భరించాను
కాని మాటకు పరిహారం కాలేదా ప్రభూ?
అయిందా? నన్ను చేర్చుకో ..
లేదా ... నాతో ఉండు!

1 comment:

  1. బాగుంది. పరిహారం అయితే ‘నన్ను చేర్చుకో...’, కాకుంటే ‘నాతో ఉండు..’. ఎలా అయినా మీకే లాభం! దైవసాన్నిహిత్యం ఎల్లవేళలా కోరుకున్నారు.

    ReplyDelete