Friday 28 October 2011

కవిత - 6

నా తప్పు కాదు ప్రభూ!

ఓపలేని ఒంటరితనం - సైపరాని అస్వస్థత
నన్ను చుట్టి, కదలనీక కట్టి, మట్టుపెట్ట నెంచగా
ఏ పనీ చేయలేని నాకు
గుర్తుకొచ్చాయి ... నీ దయావాత్సల్యాలు.
మూర్తీభవించిన దైన్యంతో - ఆర్తిగా నీదెస చూడగా
నన్ను ఏమార్చి నా కంట జారిన కన్నీరు
నా తప్పు కాదు ప్రభూ!


ఆదాయం ఐదు కాగా - అవసరాలు పదిహేనై
పెరిగిన ఇక్కట్లు నన్ను - చీకట్ల ఊబిలోకి దించగా
దిక్కేది లేక .. ఇక దక్కను అనుకున్నవేళ
నిన్ను పిలవాలనే ఆశ - నాలో సర్వత్రా నిండి

"ప్రభూ!" అని నిన్ను పిలవడం
నా తప్పు కాదు ప్రభూ!

అయినవాళ్ళే కాని - అవసరాలకు ఆదుకోరు
నమ్మిన పాపానికి - నిట్టనిలువునా ముంచేవాళ్ళు
కోకొల్లలై దిశలను, దీనులను ముంచుతున్నవేళ
ఎన్నో సునామీలు, ఎన్నెన్నో భూకంపాలు, మరెన్నో రోగాలు
వాళ్ళందరినీ రూపరచాలని కోరడం
నా తప్పు కాదు ప్రభూ!

Tuesday 25 October 2011

కవిత - 5

అమ్మ

గాలిగాడు గోలగా ఆడుతూ "అమ్మా!" అన్నాడు దైన్యంగా
తన పిచ్చిగంతుల్లో మూతి రాయికి కొట్టుకోగా ...
ఈకల స్వెట్టర్ రానందువల్ల చలికి వణుకుతూ
"అమ్మా!" అన్నది ఒక పిట్టపిల్ల దీనంగా ...
పైనుండి పల్లానికి జారుతున్న బండను చూసి
"అమ్మా!" అన్నదో ఇసుకపిల్ల గుండె పగిలేలా ...
తల్లి పొదుగునుండి తనను లాగి పాలుపిండే
రైతువంక వేదనతో చూస్తూ "అమ్మా!" అందో దూడ ....
నల్లని పెద్దమబ్బు తనను గట్టిగా కొట్టగా
"అమ్మా!" అందో పిల్లమబ్బు వానగా కన్నీళ్ళు రాలుస్తూ ....
కాలుకు ముల్లంటిననాడు - నిప్పుకు కాలంటిననాడు
గొల్లుగా, గోలగా ఏడుస్తూ "అమ్మా!" అందో చిన్నపాప ....
పీచు జుట్టున్న తాటిచెట్టన్న ఎప్పుడు పడతాడో అనే భయంతో
అటూ ఇటూ ఒరుగుతుంది చేను "అమ్మా!" అంటూ ...
ఇన్నిచోట్ల అన్నీ కలిసి "అమ్మా!" అని అంటుంటే
"అమ్మ అంటే?" అనే నా ప్రశ్నను గట్టిగా అంటే ...
"ఎవరా ప్రశ్న వేసింది?" అంటూ మేఘం
మెరుపుకళ్లతో కోపంగా చూస్తూ
ఉరుముల కంఠంతో గర్జిస్తూ
పిడుగుపాటులా ప్రశ్నిస్తే ...
అప్రయత్నంగా "అమ్మా!" అంటూ
బెదిరిపోయి ఇంట్లోకి ఉరికాను!

Thursday 13 October 2011

కవిత - 4

పాపం - పుణ్యం

నేల తల్లికి, ముండ్ల తండ్రికి
పుట్టిందో గులాబిచెట్టు.
పెరిగిన అది అందంగా నవ్విందట
ఆ నవ్వు పేరు పువ్వట!
తల్లి మురికిని కానీ, తండ్రి కరకుదనాన్ని కానీ
తనలో ఉంచుకోలేదు ఆ పువ్వు.

సంపాదించే తల్లికి, ఎలాగైనా సాధించే తండ్రికి
పుట్టాడో తనూజుడు.
తల్లి దస్కాన్ని మింగుతూ, తండ్రికి సరిసమానంగా
పెరిగాడు అన్ని అవగుణాలతో ..

పువ్వు చేసిన పుణ్యం - నరులు చేసిన పాపం
తరు లెరుగవు - నరు లెరుగరు.

తనను తాను ఇతరులకై ఇచ్చుకోవడం
తరువు చేసుకున్న ‘పుణ్యం’
తనకోసమే ఇతరులను కాలరాయడం
నరులు చేసుకొనే ‘పాపం’

Monday 10 October 2011

కవిత - 3

ఎప్పుడో? - ఏనాడో?

మధురోక్తులను వింటి - మధుర ఫలముల తింటి
పెంటదిబ్బల మీద - మింటి అందము నంటు
మట్టిపువ్వుల కంటి - మంచినవ్వుల కంటి
పూల వెంటనె ఉంటు - పూతేనియల తింటు
ఝుమ్మంటు తిరుగాడు - ఎలతేటులను కంటి

అసురసంధ్యావేళ - అరవిచ్చు కలువల్ని
అగుపడని చెలునికై - అలిగిన కమలాల్ని
చల్లనౌ ఉదయాన - పిల్లమొక్కల పైన
అల్లనల్లన పడిన - మంచుజల్లుల కంటి
చిరుగాలి తాకిడికి - చిరునవ్వులను చిందు
చిన్నారి పూబాల - చిత్రమ్మునే కంటి

చిరుచీకటులు నిండ - బెదురుతున్న వెలుగుల్ని
చిరువెలుగు రేఖలకె - అదురుతున్న నలుపుల్ని
మేఘాల మెరుపుల్ని - లేదూడ అరుపుల్ని
చిరుమువ్వ పలుకుల్ని - అల పాప నవ్వుల్ని
ఎన్నెన్నొ కన్నాను - మరి ఎన్నొ విన్నాను
శాంతి దక్కలేదు - భ్రాంతి మొక్కవోదు.

తలపులందున ఉన్న - తపనయే కడుమిన్న
ఉన్న చోటున నన్ను - ఉండనీ దన్నా!
నయనాల తమిదీర - ఆనంద మెద మీర
కనులార నా ప్రభుని - కనుగొనుట ఎప్పుడో?
ఆ ప్రభుని చరణాల - పై వ్రాలు టేనాడొ?

Sunday 9 October 2011

కవిత - 2

చిన్న ఆశ
నిలువుకొండల్ని సులువుగా
ఎక్కగల్గిన నా పాదాలు
పట్టుతప్పుతున్న ఈ రోజుల్లో ...


గమకాల ఝరియైన నా గాత్రం
సూత్రప్రాయంగా పసలేనిదై
రసాభాసం అవుతున్న ఈ రోజుల్లో ...


నాటివి, పైనాటివి, ఏనాటివో
గుర్తుంచుకొనే నా జ్ఞాపకశక్తి
నిన్నటివి, నేటివి, ఇప్పటివే
మరుస్తున్న ఈ రోజుల్లో ...


మెత్తని సవ్వడుల్ని, అతిమెత్తని గుసగుసల్ని
వినే నా వినికిడి అరుపుల్ని, కేకల్ని
వినలేకపోతున్న ఈ రోజుల్లో ...


కారుచీకట్లలో నల్లపూసల్ని
ఏరగల నా కళ్ళు నిండువెలుగుల్లో
రంగుల్ని గుర్తించలేని ఈ రోజుల్లో ....

ఆరోగ్యమే తానైన నా ఆరోగ్యం
మెల్లమెల్లగా అనారోగ్యపు హద్దుల్ని చేరి
దాన్ని అధిగమిస్తున్న ఈ రోజుల్లో ...


నాలోని లోన తలెత్తి నిఠారయింది ..
ఓ చిన్న తలపు ... నిన్ను చేరేందుకు
నా తనువు తయారౌతుందన్న
చిన్న ఆశ!

Saturday 8 October 2011

కవిత -1

పరిహారం కాలేదా ప్రభూ?
నీఇంట, నీవెంట, నీసందిట
నేనున్నప్పుడు,
అసంకిల్పితంగా ఎప్పుడైనా
ఎదురాడినానా ప్రభూ?

నీచెంత ఏచింత లేకుండా ఉంటూ
అనాలోచితంగా నోరుజారి
కానిమాట ఏదైనా  అన్నానా ప్రభూ?

నీలాలనలో మేను మరచి నిద్రించిన నేను
నా కలవరింతలలో నిన్ను కలతపరచే
కఠినమైన మాట ఏదైనా అన్నానా ప్రభూ?

నీకోసం సాగిన నా వెతుకులాటలో
నా సరసన నిన్ను గానక నిరసనతో
ఏదైనా కరకుమాట నేనన్నానా ప్రభూ?

నా ఆలోచనలు నాలోని నిన్ను ఏమార్చ
నన్ను నేనుగా పైకెత్తుకోని - నిన్ను
కించపరచే మాట నోట జార్చానా ప్రభూ?

తెలియక, తెలివిలేక, తొందరతనంతో
నోరుజారిన నా నేరాన్ని క్షమించలేవా ప్రభూ?
మందమతినై నేనన్న మాటను మన్నించలేవా ప్రభూ?
నీకు దూరంగా అరవై వత్సరాల శిక్ష భరించాను
కాని మాటకు పరిహారం కాలేదా ప్రభూ?
అయిందా? నన్ను చేర్చుకో ..
లేదా ... నాతో ఉండు!