Friday 6 January 2012

కవిత -18

ప్రాణసఖి

నీ హృదయాన్ని అందరూ
నవనీతంతో పోలుస్తారు తెలివితక్కువగా,
నీ హృదయంకన్న
నవనీతం కఠినమంటే నమ్మరే!


మనం కలిసిన మలియేటనే
నన్ను విడిచి నీవు వెళ్ళడంతో
నీగుండె రాతి దంటారు వెర్రిజనం!
నీవు వెళ్ళి పుష్కరం అయినా నేనుండడం
నా గుండె కఠినపాషాణంతో సమానం.


నీ ప్రేమ చాలా గొప్పదట!
ఎంత అన్యాయపు మాట అది ...
నన్నొంటరిగా ఉంచి నీవు వెళ్ళడం
ఎంతటి పగతో చేసిన పనో కదా?


నీ లేమి నన్ను బండగా మార్చించని
చెప్పేందుకు ఒక్క నిదర్శనం చాలు ...
కొండంత వేదన ఉన్నా
కన్నీరు కారదు ... గుండె పగులదు!

Friday 23 December 2011

కవిత - 17

స్నేహం


కాలం నీకోసం ఆగదు
ఘనపదార్థం గుంజితే సాగదు
వింతలేనిదే గుంపు మూగదు
అట్లే .. స్నేహంతో సరి ఏదీ తూగదు.

మొక్క పెరిగాక వంగదు
పిల్లలకు గట్టి పదార్థం దంగదు
చిన్నచేప పెద్దచేపను మింగదు
అట్లే ... స్నేహం పొగడ్తలకు పొంగదు.

మకరందానికి మారుగా
మాతృప్రేమ తరువాయిగా
మహిలో ఆలంబనగా నిలిచి
ఆత్మీయంగా ఆదరించేదే స్నేహం.

అరుపులు, మూతి విరుపులు, వెరపులు
పగలు, ప్రతీకారాలు, కఠిన్యాలు,
సాధింపులు, విభేదాలు, వేదింపులు
ఇవేవీ కానరాని
రెండు మనస్సుల కలయికే ... స్నేహం!

Tuesday 20 December 2011

కవిత - 16

ప్రియసఖి

నీరు నిండిన నా కళ్లకు నీ రూపం
సరిగ్గా ఆనదని తలచి కళ్ళుమూసానే కాని
నిన్ను చూడవద్దని కాదు, అయినా ...
నీవు వెళ్ళిపోయావు నే కళ్ళు తెరవకముందే!

నీవు నాకై వస్తానని అన్నావనే సంతోషంతో తాగితే
నీవు వచ్చి వెళ్ళేవరకు మెలకువ లేదు నాకు,
నీవు వచ్చి వెళ్ళావనే వేదన నాచేత మళ్ళీ తాగిస్తే
నీవు రేపు వస్తానన్నాననే మాట మరిచి నిద్రపోయాను.

నేను నీకోసం ఎదురుచూసిన దినాలలో
నీవు నాకు ఎదురుకాలేదన్న వేదన కన్న
ఎదురుతిరుగలేదనే స్వాంతన ఆనందాన్నిచ్చింది.
అందుకే ఇన్నాళ్ళయినా ఎదురుచూస్తూనే ఉన్నాను.


ఆమె సమాధిపై నేను నాటిన
గులాబీ పూసిందని ఎవరో అన్నారు, 
వాళ్ళకేం తెలుసు ఇన్నాళ్ళకు
గులాబివేర్లు ఆమె వేళ్ళను తాకాయని!

Thursday 1 December 2011

కవిత - 15

భయం - భయం

వానచుక్కనై నేలమొక్కను చేరి
మొక్కలు చచ్చిపోకుండా కాపాడాలని,
ఉక్కకు చస్తూ, నీడకై దిక్కులు చూసేవాళ్ళకై
నిప్పుగా ఉన్న నేలను చల్లార్చాలని నాకున్నా
సంద్రాన పడి నిరుపయోగి నౌతానని భయం!


పద్ద చెట్టునై రెక్కల కొమ్మ లల్లార్చి,
మండించే ఎండను కొంతైనా చల్లార్చాలని,
అపరిమితంగా కాసి, కొందరి ఆకలినైనా తీర్చాలని
ఆశగా కొద్ది కొద్దిగా నేను ఎదగగానే
నీ గూటికోసం, నాగటికోసం నన్ను నరుకుతావనే భయం!


అమ్మనై చేతుల పొత్తిళ్ళలోని నిను చూస్తూ,
పలురకాలుగా కాపాడుతూ పెంచాను ప్రేమతో
నీ నిద్రకోసం నా నిద్రకాచి, ఎన్నో ఓర్చి పెంచితే
సతి మాటలనే వినే పతివై, మతిహీనుడవై
పనికిరాని పాతవస్తువల గదికి పంపుతావనే భయం!

Sunday 27 November 2011

కవిత - 14

                           రేపటి సూర్యులు

వీళ్లు ....
రేపటి ప్రచండభాస్కరుని ప్రతిరూపాలేనా?
అయితే వీళ్ళ ముఖాలపై
మాయని చీకటి పుట్టుమచ్చ లెక్కడివి?
జనం లేని వనంలో
ఎవరిని శిక్షిద్దామని వెళ్తున్నారు?
చిరునవ్వుల్ని చిరుతపులి కోరల్లో కుదువబెట్టి
గుండెల్లో విచ్చుకున్న పువ్వుల్ని
గూడాల చేతుల్లో లంచంపెట్టి
పిరికిపందల్లా పారిపోతున్నారు.
రేపు ఉదయించే సూర్యున్ని
ఎవరికి తిలకంగా దిద్దమంటారు?
తమ్ముళ్ళూ ...!
ఇలా రండి ఒక్కసారి ...
బొగ్గుగనుల్లో నా కిక్కడ
బోలెడన్ని వజ్రాలు దొరుకుతున్నాయి.
వీటికి విలువగట్టి
వినియోగించుకోవలసించి మీరే! 


రచన - శంకర్
(స్రవంతి - ఏప్రిల్ 1985)

Saturday 26 November 2011

కవిత - 13

                             అసామాన్యుడు

నువ్వు .....
మామూలు మానవుడివి కానేకావు.
గుండెల్లో గుడిగంటల కోలాహలాన్నీ
అడుగుల్లో ఐరావతాల పురోగమనాన్నీ
చేతుల్లో చేతస్సుధాకలశాన్నీ
మాటల్లో బీజాక్షరాల విన్యాసాలనూ
చూపుల్లో దివ్యాస్త్రాల వాడినీ
రూపంలో దాపరికంలేని దైవత్వాన్నీ
రంగరించుకున్నవాడివి!
నువ్వు తలచుకుంటే
అక్షాంశాలూ రేఖాంశాలూ
నీ యింటి ముంగిట
సంక్రాంతి ముగ్గులౌతాయి.
చందమామ గిన్నెలోని వెన్నెల వెన్నముద్దలు
నేల పాలౌతున్నందుకు నిట్టూర్చకు ....
స్తబ్ధుడవై కూర్చోకు ...
నీకోసం ముంచుకొస్తున్న వెలుగు వెల్లువలో
కాసేపు కరిగిపోతే చాలు ....
..... నువ్వు అసామాన్యుడవే!

రచన - శంకర్ (28-2-1985)

Friday 25 November 2011

కవిత - 12

పరిత్యక్త

నన్నెవ్వరూ పట్టించుకోవడం లేదు!
          ఈ చిన్న గదిలో
          నన్ను నేను బంధించుకొని
          ఒంటరిగా ... ఓపికగా
          నిరీక్షిస్తున్నాను.

నన్నెవ్వరూ వినిపించుకోవడం లేదు!
          ప్రశాంత నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ
          పిలుపును పాటగా కూర్చి
          వివిధ రాగాల్లో వింత శబ్దాలతో 
          ఆలపిస్తున్నాను.

నన్నెవ్వరూ  ఇష్టపడడం లేదు!
          తలుపులు మూసి
          కిటికీలు తెరిచి 
          నా గది జైలులో 
          సహజీవనం చేయడానికి 
          మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.

రచన - శంకర్